About Me

Hyderabad, Andhra Pradesh, India

Thursday, July 7, 2011

Tiruvannantha Puram


* అనంత పద్మనాబుడి సంపద: రూ.5,00000,00,00,000!
ఇదీ అనంత పద్మనాబుడి సంపద విలువ ? * ఐదు లక్షల కోట్లంటున్న కేరళ మాజీ సీఎస్
రోజురోజుకూ మారుతున్న లెక్కలు * ఆరో మాళిగకు నాగబంధం
తెరిస్తే అరిష్టం తప్పదంటున్న భక్తులు * భద్రతపై కెరళ మంత్రివర్గ సమావేశం
ఆధునిక వ్యవస్థతో భద్రత కల్పిస్తామన్న సీఎం * తుది నిర్ణయం సుప్రీందేనన్న చాందీ
సంపద విలువను వెల్లడించొద్దన్న సుప్రీం * ఏం చేయాలన్న విషయమై భిన్న వాదనలు
శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బయటపడిన అపార సంపదను జాగ్రత్త చేయాలని తాము భావిస్తున్నా.. తుది నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకే వదిలిపెడుతున్నట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వంతో పాటు చాలామంది ప్రజలు, హిందూ సంస్థలు కూడా ఈ అపార సంపదను ఆలయంలోనే ఉంచాలని భావిస్తున్నట్లు కేరళ సీఎం ఊమెన్ చాందీ కేబినెట్ సమావేశానంతరం విలేకరులకు తెలిపారు.

ప్రస్తుతం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన భద్రత తాత్కాలికమని, ఆలయ సంప్రదాయాలకు భంగం వాటిల్లకుండా ఆధునిక సాంకేతిక వ్యవస్థతో కూడిన శాశ్వత భద్రతా వ్యవస్థను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని ఆయన చెప్పారు. అయితే, ఇది భక్తుల దర్శనానికి ఏమాత్రం ఆటంకం కాబోదన్నారు. ఈ ఏర్పాట్లకు కోర్టు ఆమోదం కూడా కావాల్సి ఉంటుందన్నారు.

ఆలయం కేరళకే గర్వకారణమని, ఈ అపార సంపదను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు సమాజానికి కూడా ఉంటుందని సీఎం చెప్పారు. సంపద మొత్తం విలువ ఎంత అని చెప్పేందుకు ప్రస్తుతానికి ఎవరికీ అధికారం లేదని తెలిపారు. ఆలయంలో ఆభరణాలు, ఇతర వస్తువులు ఏమేం ఉన్నాయో చూడాల్సిందిగా మాత్రమే కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. వాటి విలువను వెల్లడించకూడదని ట్రావన్‌కోర్ రాజకుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిసిందని ఆయన అన్నారు. మొత్తం ఆరు మాళిగల్లో ఐదింటిని ఇప్పటివరకు తెరిచారు.

మొత్తం వీడియో తీయండి: సుప్రీం
పద్మనాభస్వామి ఆలయ నేలమాళిగల్లో ఉన్న సంపద మొత్తాన్ని వీడియో తీయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు బయటపడిన సంపదను పరిరక్షించేందుకు ఏదైనా మ్యూజియం క్యూరేటర్‌ను నియమించే ప్రతిపాదనను కూడా పరిశీలించాలని జస్టిస్ ఆర్‌వీ రవీంద్రన్, జస్టిస్ ఏకే పట్నాయక్‌లతో కూడిన ధర్మాసనం చెప్పింది. ఇప్పటివరకు బయటపడిన సంపద విలువ దాదాపు లక్ష కోట్లని తెలుస్తున్న విషయం తెలిసిందే.

ఆలయ ఆస్తులను, నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటూ జనవరి 31న కేరళ హైకోర్టు ఇచ్చిన రూలింగ్‌ను సవాలుచేస్తూ ట్రావన్‌కోర్ రాజవంశానికి చెందిన రాజా రామవర్మ దాఖలుచేసిన పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు ఈ సూచనలు చేసింది. సంపద వెలికితీసే ప్రక్రియ కొనసాగుతుండగా ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వడం గానీ, దాని వివరాలు చెప్పడం గానీ చేయొద్దని పరిశీలకులను ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

ఇప్పటిదాకా ఏం దొరికాయి?
అసలింతకీ ఆలయ నేలమాళిగల్లో ఏముందన్న విషయం అందరికీ ఆసక్తిదాయకంగా మారింది. ఇప్పటివరకు బయటపడిన సొత్తు విలువ దాదాపు లక్ష కోట్లకు పైమాటేనని చెబుతున్నా, కచ్చితమైన విలువ ఎంతో బయటపెట్టడానికి మాత్రం కోర్టు అంగీకరించని విషయం తెలిసిందే.

మొత్తం సంపద ఎంతుందో.. ఏవేం ఉన్నాయో చూసి జాబితా సిద్ధం చేసేందుకు సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఇందులో కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు ఇద్దరు కూడా ఉన్నారు. వీరంతా కలిసి ఆరు నేలమాళిగల్లో ఉన్న అపార సంపదను లెక్కిస్తూ.. దాని జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, రాజకుటుంబానికి చెందిన ఇద్దరు కూడా ఉంటున్నారు.

ఇప్పటివరకు తెలిసిన వివరాల ప్రకారం బయటపడ్డ సంపద వివరాలివీ...
- నాటి రాజకుటుంబానికి చెందిన కిరీటాలు
- 17 కిలోల బంగారు నాణేలు
-2.5 కిలోల బరువు, 18 అడుగుల పొడవు ఉన్న షరపోలి మాల
-బంగారు తాళ్లు
- ఒక బస్తా నిండా వజ్రాలు
- వేల సంఖ్యలో పురాతన నగలు
- బంగారు పాత్రలు
- వివిధ రాజకుటుంబాలు, యాత్రికులు, వర్తకులు చేసిన దానాలు
- పలు శతాబ్దాల క్రితం నాటి అత్యంత అరుదైన, విలువైన మాణిక్యాలు
- పురాతన బంగారు ఆభరణాలు
- వజ్రాలు, నవరత్నాలతో పాటు బెల్జియన్ రత్నాలు
- రోమ్‌నుంచి వచ్చిన పురాతన నాణేలు
- ఈస్టిండియా కంపెనీకి చెందిన బంగారు నాణేలు
- విలువైన రత్నాలు, బంగారంతో తయారుచేసిన విష్ణుమూర్తి విగ్రహం
- బంగారు గింజలు
- బంగారు పతకాలు
- బంగారు రాజదండాలు

ఆ సంపదను ఏం చేయాలి?
ఆ సంపద అపారం. లెక్కలకు అందని మొత్తం. ఇప్పటికీ తెరుచుకోని ఒక నేలమాళిగలో ఇంకెంత సొత్తు దాగుందో ఎవరికీ తెలియదు. ట్రావన్‌కోర్ సంస్థానాధీశుల నుంచి అనేకమంది ఈ ఆలయానికి అందించిన సంపద మొత్తం అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలోని నేలమాళిగలలో ఇన్ని శతాబ్దాలుగా భద్రంగా ఉంది.

అయితే.. ఇప్పుడు ఈ మొత్తం సంపదను ఏం చేయాలన్న విషయమై కేరళీయులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ సంపదలో కనీసం ఒక్క శాతం మొత్తాన్నైనా సామాజిక కార్యకలాపాలకు వినియోగించగలిగే అవకాశం ఉంటే, ఒక సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించి, అందులో పేద ప్రజలకు కులమత భేదాల్లేకుండా ఉచిత వైద్యం అందించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందని శబరిమల ఆలయ పూజారి వంశానికి చెందిన రాహుల్ ఈశ్వర్ అన్నారు.

సంపదలో కొంత భాగాన్ని ఏదైనా మ్యూజియంలో ప్రదర్శించొచ్చని, అయితే ఈ విషయంలో భద్రత చాలా ముఖ్యమైన అంశమని రాధికా సి.నాయర్ అభిప్రాయపడ్డారు. ఇంత అపార సందపను చూడటం అద్భుతమైన అనుభవం కాబట్టి.. ప్రజలకు ఆ హక్కు ఉందని ఆమె అన్నారు. సంపద మొత్తం ఆలయానికే చెందుతుందని, అందువల్ల అక్కడే ఉంచాలని కేరళ ప్రభుత్వం చెబుతోంది. అయితే ట్రావన్‌కోర్ రాజకుటుంబం మాత్రం ఈ విషయంలో మౌనాన్నే ఆశ్రయిస్తోంది. ఈ విషయంలో తుది నిర్ణయాన్ని సుప్రీంకోర్టే వెల్లడించాల్సి ఉంది.

నాగ బంధంలో ఆరో నేల మాళిగ!
అనంత పద్మనాభుడి ఆలయంలో ఉన్న ఆరో నేలమాళిగను ఇప్పటివరకు తెరవలేదు. దాన్ని తెరిస్తే కచ్చితమైన లెక్క తేలుతుందని అంటున్నారు. పురాతన కాలానికి చెందిన ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు, మరకత మాణిక్యాలు, కిరీటాలు.. ఇవన్నీ ఉండటంతో వాటి విలువ అపారంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే.. ఆరో నేలమాళిగకు 'నాగబంధం' ఉంది.

అందువల్ల దీన్ని తెరిస్తే అరిష్టం తప్పదని భక్తులు నమ్ముతున్నారు. సంపద లెక్కతేలుస్తున్న కమిటీ సభ్యులలో ఒకరికి కాలు విరిగిపోగా, మరొకరి తల్లి దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తాజాగా మరణించారు. ఈ విషయాలన్నింటినీ అందుకు నిదర్శనంగానే భక్తులు చెబుతున్నారు. నాగబంధాన్ని తెరవడం అంత సులభమూ కాదు.. మంచిదీ కాదని వారు అంటున్నారు.

అనంత పద్మనాభస్వామి వేయి పడగల శేషనాగు మీద శయనిస్తారు కాబట్టి.. ఆ ముద్రలో ఉన్న స్వామి ఆలయంలో మాళిగలను.. అందునా నాగబంధం ఉన్న మాళిగలను తెరవడం ఏమాత్రం సరికాదని వారు చెబుతున్నారు. దాదాపు శతాబ్దం క్రితం ఒకసారి కేరళలో విపరీతమైన కరువు వచ్చినప్పుడు కూడా ఈ మాళిగలను తెరుద్దామన్న ప్రయత్నం చేసినా.. నీళ్లు ప్రవహిస్తున్న శబ్దాలు రావడంతో మానుకున్నారన్న కథనాలు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి.

No comments:

Post a Comment